తొలి ఏకాదశి
27 జూలై 2015
27 జూలై 2015
తొలి ఏకాదశి |
పురాణగాధ:-
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. విష్ణుమూర్తి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చాతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.
యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు. ఏకాదశి అంటే పదకొండు అంటే అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.
విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. ఈ నెలలో ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి.
DEAR SIR, KINDLY INCLUDE ENGLISH/KANNADA LANGUAGE FOR NON SPEAKING TELUGU PEOPLE WHEREIN IS IS EASY TO UNDERSTAND THE CULTURES/CUSTOMS SIR.
ReplyDelete