Pages

Monday, 12 October 2015

Dussehra

దసరాశరన్నవరాత్రులు

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకూ తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. నవరాత్రులంటే మహిళలు దేవిని స్మరిస్తూ పండగ చేసుకుంటారు. ఈ అమ్మవారి ఆరాధనా మహోత్సవాన్ని 'శరన్నవరాత్రి ఉత్సవాలు'గా, 'దేవీనవరాత్రులు'గా పిలుస్తుంటారు. మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ తొమ్మిదిరోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి పూజించడం జరుగుతుంటుంది.

భక్తులు ఈ తొమ్మిదిరోజుల పాటు దీక్ష చేపట్టి, ఏకభుక్త వ్రతాన్ని ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శరన్నవరాత్రులలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఎవరైతే తనని పూజిస్తారో, వాళ్లు తనకి అత్యంత ప్రీతిపాత్రులని అమ్మవారే స్వయంగా చెప్పినట్టుగా పురాణాలు వెల్లడిస్తున్నాయి.

దేవీ నవరాత్రులు ఎంతో విశిష్టమైనవి, మహా పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజు ఒక్కో రూపంగా అలంకరించబడిన అమ్మవారిని దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. ఇలా తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం వలన ధనధాన్యాలు ... సంతాన సౌభాగ్యాలు ... సుఖశాంతులు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

ఇక దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ 
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ 
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త 'దశమి' తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు "దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు దైవజ్ఞలు.
ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తానక్షత్రములో కూడియున్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించడం చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. అందువల్ల ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభిస్తారు.
అందులో మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని పెద్దలు చెబుతున్నారు.
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ప్రకారం 13-10-2015 నుండి 22-10-2015 వరకు శ్రీ కనక దుర్గా అమ్మవారి అలంకారముల వివరములు 
శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి - ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి (13-10-2015)
శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి -ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి (మిగులు) (14-10-2015)
శ్రీ గాయత్రి దేవి ఆశ్వీయుజ శుద్ధ విదియ (15-10-2015)
శ్రీ మహాలక్ష్మిదేవి   - ఆశ్వీయుజ శుద్ధ తదియ  (16-10-2015)
శ్రీ అన్నపూర్ణా దేవి  - ఆశ్వీయుజ శుద్ధ చవతి (17-10-2015)
శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి - ఆశ్వీయుజ శుద్ధ పంచమి (18-10-2015)
శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) - ఆశ్వీయుజ శుద్ధ షష్టి (19-10-2015)

శ్రీ దుర్గా దేవి - ఆశ్వీయుజ శుద్ధ సప్తమి  (20-10-2015)
శ్రీ మహిషాసురమర్ధినీ దేవి - ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నవమి (21-10-2015)
శ్రీ రాజరాజేశ్వరి దేవి - ఆశ్వీయుజ శుద్ధ నవమి/దశమి (22-10-2015)

No comments:

Post a Comment